ప్రముఖ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయనతో కలిసి పనిచేసిన సినీ ప్రముఖులు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా గేయరచయిత వైరిముత్తు ‘16 వయతినిలే’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు.
ఈ చిత్రంలో రజనీకాంత్, కమల్ హాసన్, శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించారు. ఓ కీలక సన్నివేశంలో శ్రీదేవి, రజనీకాంత్ పాత్రపై కోపంతో ఉమ్మివేయాల్సి ఉంటుంది. మొదట సబ్బు నురగతో ఆ సన్నివేశాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేసినా, అది సహజంగా కనిపించకపోవడంతో చిత్రబృందం సందిగ్ధంలో పడింది.
అప్పుడు రజనీకాంత్ స్వయంగా ముందుకు వచ్చి, “సన్నివేశం సహజంగా రావాలంటే నిజంగానే నాపై ఉమ్మివేయండి” అని సూచించారు. అయితే శ్రీదేవి అందుకు మొదట నిరాకరించి, అలా చేయలేనని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తర్వాత రజనీకాంత్ ఈ విషయాన్ని దర్శకుడు భారతీరాజాకు వివరించగా, కథకు అవసరమైతే ఆ సన్నివేశాన్ని సహజంగా చేయాలని ఆయన సూచించారు. కొంత చర్చ తర్వాత శ్రీదేవి ఇబ్బంది పడుతూనే ఆ సన్నివేశాన్ని పూర్తి చేశారు.
ఆ రోజు రజనీకాంత్ చూపిన అంకితభావాన్ని చూసి భారతీరాజా భావోద్వేగానికి గురై ఆయనను హత్తుకున్నారని వైరిముత్తు తెలిపారు. నటనలో నిబద్ధత ఎంత ముఖ్యమో ఈ సంఘటన చూపిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రానికి కె. భాగ్యరాజా సహాయ దర్శకుడిగా పనిచేసిన విషయాన్ని కూడా వైరిముత్తు గుర్తు చేశారు.

