హరీష్‌రావు గొప్ప నాయకుడు: విజయ్

హరీష్‌రావు గొప్ప నాయకుడు: విజయ్

సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్‌ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు, సినీ నటుడు విజయ్ దేవరకొండ శనివారం సందర్శించారు. ఆసుపత్రిలో గుండె చికిత్స పొందుతున్న చిన్నారులతో వారు ముచ్చటించి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్ దేవరకొండ హరీష్‌రావుపై ప్రశంసలు కురిపించారు. తనకు హరీష్‌రావు అంటే ఎంతో అభిమానం ఉందని, ఆయన్ను ‘సిద్ధిపేటకా షేర్’ అంటూ సంబోధించారు. తెలంగాణలో చిన్నారుల గుండె వైద్య సేవల అవసరాన్ని గుర్తించి, ఆరోగ్య మంత్రిగా ఉన్న సమయంలో ఈ ఆసుపత్రి ఏర్పాటుకు భూమిని కేటాయించిన ఘనత హరీష్‌రావుదేనని గుర్తు చేశారు.

రాజకీయాలకు అతీతంగా పేద చిన్నారుల గుండె చికిత్స కోసం, సమాజ సంక్షేమం కోసం హరీష్‌రావు చేస్తున్న సేవలు అభినందనీయమని విజయ్ అన్నారు. చిన్నారుల గుండె ఆపరేషన్లకు ఆయన అందిస్తున్న సహకారం ఎంతో గొప్పదని కొనియాడారు. ఇలాంటి నాయకులు ఒక తరం మొత్తానికి అరుదుగా ఉంటారని వ్యాఖ్యానించారు.

ఈ ప్రత్యేక వైద్య కేంద్రాన్ని సందర్శించడం, హరీష్‌రావు చేస్తున్న సేవలను ప్రత్యక్షంగా చూడడం తనకు ఎంతో ఆనందంగా అనిపించిందని విజయ్ దేవరకొండ తెలిపారు.

Related Articles