బయోపిక్‌తో సెలీనా పునరాగమనం

బయోపిక్‌తో సెలీనా పునరాగమనం

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ 15 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. స్వామి వివేకానంద శిష్యురాలు సిస్టర్ నివేదిత జీవితకథ ఆధారంగా రూపొందుతున్న బయోపిక్‌లో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ‘ఏక్ దువా’ లఘు చిత్రానికి జాతీయ పురస్కారం అందుకున్న దర్శకుడు రామ్‌కమల్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సెలీనా చివరిసారిగా 2011లో విడుదలైన కన్నడ చిత్రం ‘శ్రీమతి’లో ఉపేంద్ర సరసన నటించారు.

సిస్టర్ నివేదిత పాత్ర పోషించడం తన కెరీర్‌లో ఎంతో అర్థవంతమైన అవకాశమని సెలీనా తెలిపారు. చిన్నప్పటి నుంచే తన తల్లి ద్వారా నివేదిత సేవల గురించి తెలుసుకున్నానని, ఇప్పుడు ఆమె పాత్రలో నటించడం మరపురాని అనుభూతిగా భావిస్తున్నానన్నారు. ఐరోపాలో 15 ఏళ్లు గడిపిన తర్వాత తిరిగి భారతదేశానికి వచ్చి, సనాతన ధర్మంతో మరింత అనుబంధం ఏర్పడిందని ఆమె చెప్పారు.

1867లో ఐర్లాండ్‌లో జన్మించిన మార్గరెట్ నోబెల్, 1895లో స్వామి వివేకానంద బోధనలకు ఆకర్షితురాలై భారత్‌కు వచ్చారు. 1898లో ఆయన శిష్యరికాన్ని స్వీకరించి ‘సిస్టర్ నివేదిత’గా పేరు మార్చుకున్నారు. విద్య, ఆధ్యాత్మికత, మహిళా సాధికారత రంగాల్లో విశేష సేవలందించి అనేక మందికి స్ఫూర్తిగా నిలిచారు. 1911లో 43 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూశారు. ఈ బయోపిక్ ద్వారా ఆమె విశిష్ట జీవితాన్ని మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు.

Related Articles