తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాలో నటిస్తున్నారు. ‘కరుప్పు’ విజయానంతరం రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులకు చిత్ర బృందం మరో ఆసక్తికరమైన అప్డేట్ అందించింది.
సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సినిమాలోని ఓ ప్రత్యేక డ్యాన్స్ నంబర్‌ను సూర్య స్వయంగా ఆలపించారు. దీంతో చాలా కాలం తర్వాత సూర్య మళ్లీ గాయకుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతంలో 2014లో విడుదలైన ‘అంజన్’ చిత్రంలోని ‘ఏక్ దో తీన్’ పాటను పాడిన సూర్య, మళ్లీ జి.వి. ప్రకాష్ సంగీతంలోనే పాట పాడటం విశేషంగా మారింది.
ఈ పాటకు నటుడు, దర్శకుడు, గేయరచయిత కెన్ కరుణాస్ సాహిత్యం అందించారు. సూర్య ఆలపించిన పాటను వినేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, త్వరలోనే విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని చిత్ర వర్గాలు తెలిపాయి.
ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్గా నటిస్తుండగా, రవీనా టాండన్, రాధిక శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని 2026 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

