బాలీవుడ్ బుల్లితెర నటులు గౌరవ్ ఖన్నా, ఆకాంక్ష చమోలా తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. దాదాపు పదేళ్ల దాంపత్యం అనంతరం విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆకాంక్ష వెల్లడించారు. ఈ విషయాన్ని ఆమె ‘లాక్ అప్ సీజన్-2’ ప్రీమియర్ కార్యక్రమంలో అధికారికంగా ప్రకటించారు.
గత ఏడాది నుంచి తాము విడివిడిగా ఉంటున్నామని, ఇప్పటి వరకు ఈ విషయాన్ని బయటకు చెప్పలేదని ఆకాంక్ష తెలిపారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేదా ద్వేషం లేదని, ఇప్పటికీ ఒకరితో ఒకరు స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటున్నామని చెప్పారు. అయితే జీవిత లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికలు భిన్నంగా ఉండటంతో భార్యాభర్తలుగా కలిసి కొనసాగడం సాధ్యం కాదని భావించి పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.
గౌరవ్ ఖన్నా, ఆకాంక్ష చమోలా చాలా కాలం ప్రేమించుకుని 2016 నవంబర్ 24న కాన్పూర్‌లో వివాహం చేసుకున్నారు. బాలీవుడ్ టెలివిజన్ రంగంలో పలు సీరియల్స్ ద్వారా గుర్తింపు పొందిన ఈ జంట విడాకుల నిర్ణయం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. సినీ, టెలివిజన్ రంగంలో వరుసగా ప్రముఖ జంటలు విడాకులు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఈ వార్త కూడా చర్చనీయాంశంగా మారింది.

