అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ కామెడీ చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’ సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుని యూఏ సర్టిఫికేట్ పొందింది. ‘వెల్కమ్’ ఫ్రాంచైజీలో భాగంగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) చిత్రానికి మొత్తం 18 మార్పులను సూచించినట్లు సమాచారం. కొన్ని డైలాగ్‌ల సవరణ, కొన్ని పదాలను మ్యూట్ చేయడం, కొన్ని ప్రస్తావనలను తొలగించడం వంటి మార్పులు చేశారు. అలాగే దిశా పటాని, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లకు సంబంధించిన కొన్ని గ్లామరస్ షాట్లను ట్రిమ్ చేసినట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. మద్యం సేవించే సన్నివేశాల్లో యాంటీ- ఆల్కహాల్ హెచ్చరికలను కూడా జోడించారు.
అయితే 18 మార్పులు చేసినప్పటికీ సినిమా నుంచి తొలగించిన మొత్తం నిడివి కేవలం 10 సెకన్లు మాత్రమేనని తెలుస్తోంది. సెన్సార్ అనంతరం చిత్రం రన్‌టైమ్ 165 నిమిషాలు (2 గంటల 45 నిమిషాలు)గా ఖరారైంది. దీంతో ఈ ఏడాది విడుదల కానున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్లలో ఇది అత్యంత సుదీర్ఘ చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది.
ఇదిలా ఉండగా, గతంలో సినిమా నాలుగు గంటల నిడివితో సిద్ధమైందని, తర్వాత కుదించామని అక్షయ్ కుమార్ పేర్కొనగా, ప్రస్తుతం రన్‌టైమ్‌పై అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

