జగన్నాథ్ మూవీపై సుప్రీంకోర్టు విచారణ

జగన్నాథ్ మూవీపై సుప్రీంకోర్టు విచారణ

ఎలీ యానిమేషన్స్ నిర్మించిన ‘మహాప్రభు జగన్నాథ్’ సినిమా విడుదలపై ఏర్పడిన వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. శుక్రవారం విడుదల కావాల్సిన ఈ సినిమాపై ఒడిశా హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించగా, ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. అత్యవసరంగా విచారణ చేపట్టాలని నిర్మాతల తరఫు సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ కోర్టును కోరారు.

ఇక ఒడిశా హైకోర్టు తన ఉత్తర్వుల్లో, సినిమాలో మహాప్రభు జగన్నాథుడి పాత్రను చిత్రీకరించిన విధానంపై న్యాయపరమైన సమీక్ష అవసరమని పేర్కొంది. మహేష్ కుమార్ సాహూ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు, తాత్కాలికంగా సినిమా విడుదలను నిలిపివేసింది.

పిటిషనర్ల వాదన ప్రకారం, సినిమాలో జగన్నాథుడి బాల్యం, సంభాషణలు, సాహసాలు, యుద్ధ ఘట్టాలను చూపిన తీరు స్కంద పురాణం, బ్రహ్మ పురాణం, సనాతన ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే సినిమాకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) జారీచేసిన సర్టిఫికెట్‌ను రద్దు చేసి, ఒడిశాలో సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని కోర్టును కోరారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుపై సినిమా విడుదల భవితవ్యం ఆధారపడి ఉంది.

Related Articles