ఒకప్పుడు టాలీవుడ్లో డిసెంబర్‌ను అన్‌సీజన్‌గా భావించేవారు. కానీ గత కొన్నేళ్లుగా ఈ నెలలో విడుదలైన భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధించడంతో ఇప్పుడు స్టార్ హీరోలు డిసెంబర్ రిలీజ్‌లపై దృష్టి పెడుతున్నారు. ఈసారి కూడా డిసెంబర్లో ఇద్దరు అగ్రహీరోలు ప్రభాస్, నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధమవుతున్నారు.
హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ చిత్రాన్ని డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. యుద్ధ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
మరోవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ను తొలుత దసరాకు విడుదల చేయాలని భావించినా, షూటింగ్ ఆలస్యం కారణంగా డిసెంబర్ 4కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
దీంతో కేవలం ఒక రోజు వ్యవధిలోనే ప్రభాస్, బాలకృష్ణ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు ఒకేసారి విడుదలవుతుండటంతో డిసెంబర్ తొలి వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద హోరాహోరీ పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. ఈ క్లాష్‌పై ట్రేడ్ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ భారీ ఆసక్తి నెలకొంది. అధికారిక విడుదల తేదీలపై చిత్రబృందాల నుంచి త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

