టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేకు మరో భారీ అవకాశం దక్కబోతోందన్న వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘ఓజీ 2’లో హీరోయిన్‌గా పూజా హెగ్డే పేరును పరిశీలిస్తున్నట్లు ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
గతంలో హరీశ్ శంకర్ దర్శకత్వంలోని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో పవన్ సరసన పూజా హెగ్డే నటిస్తారనే వార్తలు వచ్చినా, డేట్స్ సమస్యల కారణంగా ఆ కాంబినేషన్ కార్యరూపం దాల్చలేదు. దీంతో ఇప్పుడు ‘ఓజీ 2’లో ఈ జోడీ కనిపించే అవకాశముందన్న ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఇటీవల వరుస పరాజయాలతో టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిన పూజా హెగ్డేకు ఈ సినిమా దక్కితే కెరీర్‌కు మంచి మలుపు తిరిగే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ‘ఓజీ’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండటంతో, సీక్వెల్‌కు సంబంధించిన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే పూజా హెగ్డే ఎంపికపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తలను కేవలం ప్రచారంగానే చూడాల్సి ఉంది.

