రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్అప్స్’పై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలకు నిర్మాత కె. నారాయణ స్పందించారు. ఇటీవల విడుదలైన టీజర్, పాటలోని కొన్ని రొమాంటిక్ సన్నివేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన సినిమా స్వరూపంపై స్పష్టత ఇచ్చారు.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన నారాయణ, ‘టాక్సిక్’ సాధారణ కమర్షియల్ సినిమా కాదని, పూర్తిగా పెద్దల కోసం రూపొందించిన కల్పిత కథ అని తెలిపారు. భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమాని నిర్మిస్తున్నామని, ఇప్పటివరకు తమ సంస్థ రూపొందించిన సినిమాల కంటే ఇది పూర్తిగా భిన్నమైన అనుభూతిని అందిస్తుందని చెప్పారు. ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూసిన తర్వాత తప్పకుండా ప్రశంసిస్తారనే నమ్మకం వ్యక్తం చేశారు.
ఇటీవల విడుదలైన ‘మనసాగదే’ పాటలో యశ్, తారా సుతారియా మధ్య చిత్రీకరించిన రొమాంటిక్ సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పాటపై తారా సుతారియా కూడా స్పందిస్తూ, అందులోని విజువల్స్ ఎంతో అందంగా తెరకెక్కాయని పేర్కొన్నారు.
ఈ సినిమాలో యశ్ సరసన నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యూమా ఖురేషీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

