తమిళనాడు ప్రభుత్వం కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు రాజ్యాంగ నిబంధనలు, అర్హతలు, ప్రతిభ ఆధారంగానే జరగాలని స్పష్టం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన తాత్కాలిక నియామక ఉత్తర్వులను కొట్టివేసింది. గతేడాది టీవీకే ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా, బాధిత కుటుంబాలకు ఇచ్చిన హామీ మేరకు ఇటీవల ప్రభుత్వం 32 మందికి తాత్కాలిక ఉద్యోగ నియామక పత్రాలు అందజేసింది. అయితే, ఈ నియామకాలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని ఆరోపిస్తూ AIADMK నేత ఆర్.బి. ఉదయ్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వ ఉద్యోగాలు ప్రత్యేక మినహాయింపుల పేరుతో ఇవ్వలేమని పేర్కొంది. ఉద్యోగ నియామకాలు తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TNPSC) వంటి రాజ్యాంగబద్ధ సంస్థల ద్వారా పారదర్శకంగా జరగాలని సూచించింది. నియామక ప్రక్రియలో నిబంధనలను పక్కనపెడితే పరిపాలనలో అరాచకానికి దారితీసే ప్రమాదం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ తీర్పుపై తమిళనాడు ప్రభుత్వం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

