అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ సినిమా విజయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి భాగ్యశ్రీ బోర్సే తాజాగా తన సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఓ కళాశాలలో నిర్వహించిన టాక్ షోలో మాట్లాడుతూ, మొదట తన కుటుంబం సినిమాల్లోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిందని వెల్లడించారు. సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్న విషయాన్ని ముందుగా తల్లికి చెప్పగా అంగీకరించలేదని, తండ్రి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. అక్క నుంచి అయినా మద్దతు లభిస్తుందని భావించినా, ఆమె కూడా కుటుంబ నిర్ణయానికే మద్దతు ఇచ్చిందన్నారు. అయినప్పటికీ నటనపై ఉన్న ఆసక్తితో ఆడిషన్లు ఇవ్వడం ప్రారంభించానని చెప్పారు.
తాను సినిమాల కోసం ప్రయత్నించడం కుటుంబ సభ్యులకు నచ్చకపోవడంతో, తన తల్లి వాట్సాప్లో బ్లాక్ చేసి దాదాపు ఆరు నెలల పాటు మాట్లాడలేదని భాగ్యశ్రీ వెల్లడించారు. ఇప్పుడు ఆ విషయాలను నవ్వుకుంటూ చెప్పగలుగుతున్నప్పటికీ, అప్పట్లో మాత్రం చాలా బాధపడ్డానని పేర్కొన్నారు.
సినీ పరిశ్రమపై తల్లిదండ్రులకు సహజంగానే కొన్ని ఆందోళనలు ఉంటాయని చెప్పిన భాగ్యశ్రీ, అయితే జీవితంలో పశ్చాత్తాపం లేకుండా ఉండాలంటే మనకు నచ్చిన రంగంలో ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యంగా ఏ నిర్ణయం తీసుకున్నా ముందుగా మనపై మనకు నమ్మకం ఉండాలని యువతకు సందేశం ఇచ్చారు.

