మోహన్‌బాబు 50 ఏళ్ల సినీ కెరీర్ కంప్లీట్…

మోహన్‌బాబు 50 ఏళ్ల సినీ కెరీర్ కంప్లీట్…

 మోహన్‌బాబు నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. శోభన్‌బాబు హీరోగా వచ్చిన ‘కన్నవారి కలలు’ (1974) సినిమాలో నటుడిగా ఆయన తొలి సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించారాయన. ఆ తర్వాత దర్శకరత్న దాసరి నారాయణరావు దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసి, ఆయన దర్శకత్వంలోనే వచ్చిన ‘స్వర్గం-నరకం’ (1975)తో హీరోగా మారారు. అప్పట్నుంచి మోహన్‌బాబు వెనుదిరిగి చూసుకోలేదు. విలన్‌గా దశాబ్దానికి పైగా తిరుగులేని ప్రస్థానాన్ని సాగించారు. 1982లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ని స్థాపించి ‘ప్రతిజ్ఞ’ చిత్రంతో నిర్మాతగా మారారు. ఆ తర్వాత అదే సంస్థలో 75 సినిమాలను నిర్మించారు. అటు హీరోగా, ఇటు విలన్‌గా, మరోవైపు కమెడియన్‌గా రకరకాల పాత్రలు చేస్తూ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకుంటూ, నిర్మాతగా కూడా దూసుకుపోతున్న మోహన్‌బాబుకు ‘అల్లుడుగారు’ (1990) హీరోగా తొలి బ్రేక్‌ ఇచ్చింది. అసెంబ్లీరౌడీ, రౌడీగారిపెళ్లాం, అల్లరిమొగుడు, బ్రహ్మ, సోగ్గాడిపెళ్లాం ఇలా వరుస విజయాలతో ‘కలెక్షన్‌ కింగ్‌’గా అవతరించారాయన. 1995లో వచ్చిన ‘పెదరాయుడు’తో ఇండస్ట్రీ హిట్‌ని అందుకున్నారు. తెలుగు సినిమాకే కాకుండా, శ్రీవిద్యా నికేతన్‌ ద్వారా విద్యారంగానికి చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం నుండి 2007లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 2016లో ఫిల్మ్‌ఫేర్‌ జీవిత సాఫల్య పురస్కారాన్ని స్వీకరించారు. సినీ కళాకారుడిగా 50 ఏళ్లు మోహన్‌బాబు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన కొడుకు విష్ణు ప్రత్యేక ఈవెంట్లు నిర్వహించనున్నారు.

editor

Related Articles