దేశంలోనే డిమాండ్ ఉన్న సూపర్‌స్టార్లలో ఒకరిగా అవతరించారు డార్లింగ్ ప్రభాస్. ‘బాహుబలి’ నుండి నిన్నమొన్నటి ‘కల్కి 2898ఏడీ’ వరకూ ఆయన యాక్ట్ చేసిన ప్రతి సినిమా, వందల కోట్ల వసూళ్లను రాబడుతూ ప్రభాస్ స్టామినాను తెలియజేస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొన్న ‘ఆదిపురుష్’ కూడా దాదాపు 450 కోట్ల వసూళ్లను రాబట్టిందంటే ప్రభాస్ స్టామినా ఏంటో అర్థం అవుతోంది అనుకుంటాను. ఆయన ‘బాహుబలి 2’ 1800 కోట్ల వసూళ్లతో దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆ రికార్డును అందుకునే సినిమాయే లేదు. ప్రస్తుతం ఆయన జెట్ స్పీడ్‌తో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్’, హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’, మరోవైపు సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్’, ఇంకోవైపు ప్రశాంత్‌నీల్ ‘సలార్ 2’. ఇక నాగ్ అశ్విన్ ‘కల్కి 2’ ఎలాగా సీక్వెల్ ఉంది. వీటిలో కొన్ని షూటింగ్ దశలో ఉంటే.. కొన్ని ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.
కన్నడ సినీరంగంలో పేరెన్నికగన్న ప్రతిష్టాత్మక చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. ఇప్పటికే వారు నిర్మిస్తున్న ‘సలార్ 2’లో నటిస్తున్నారు ప్రభాస్. ఈ సినిమా తర్వాత ‘హోంబలే’ నుండి వచ్చే మరో రెండు సినిమాల్లో ఆయన నటించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి.