టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలనే ఆలోచన తనకు లేదని, కాలేజీ ఫస్ట్ ఇయర్‌లో ఉండగా అనుకోకుండా సినిమా అవకాశం వచ్చిందని చెప్పారు.
తన ఫొటోలు చూసిన కన్నడ చిత్ర నిర్మాతలు కుటుంబాన్ని సంప్రదించారని, తొలి సినిమాకు రూ.5 లక్షల పారితోషికం ఇస్తామని చెప్పడంతో నటించేందుకు అంగీకరించానని తెలిపారు. అయితే నటనపై ఆసక్తితో కాకుండా, ఆ డబ్బుతో కారు కొనాలనే కోరికతోనే మొదటి సినిమా చేశానని రకుల్ వెల్లడించారు. స్నేహితుల్లో అందరికన్నా ముందుగా కారు కొనాలని అనిపించిందని చెప్పారు.
దాదాపు 40 రోజుల షూటింగ్ అనంతరం నటనపై ఆసక్తి పెరిగిందని, అప్పుడే సినిమాలనే కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. చదువుకు ఇబ్బంది కలగకుండా కొన్ని పెద్ద అవకాశాలను కూడా వదులుకున్నానని చెప్పారు.
2009లో కన్నడ సినిమా ‘గిల్లీ’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన రకుల్, తెలుగులో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో గుర్తింపు పొందారు. ఆ తర్వాత పలు హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ప్రస్తుతం నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ సినిమాలో శూర్పణఖ పాత్రలో నటిస్తున్నారు.

