పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమాపై మరోసారి ఆసక్తికరమైన ప్రచారం మొదలైంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కీలక పాత్రలో నటించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్గా తృప్తి డిమ్రి నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే కథలో కీలక మలుపు తీసుకొచ్చే ప్రత్యేక పాత్ర కోసం కత్రినా కైఫ్‌ను సంప్రదించినట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఆమె పాత్ర నిడివి తక్కువైనా కథకు కీలకంగా ఉంటుందని ప్రచారం సాగుతోంది.
కత్రినా కైఫ్ గతంలో మల్లీశ్వరి, అల్లరి పిడుగు సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఈ వార్త నిజమైతే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆమె తెలుగు సినిమాలో నటించినట్లవుతుంది.
అయితే ఈ ప్రచారంపై ఇప్పటివరకు కత్రినా కైఫ్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా లేదా నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

