పవన్ డిశ్చార్జ్.. విశ్రాంతికి సలహా

పవన్ డిశ్చార్జ్.. విశ్రాంతికి సలహా

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స అనంతరం నాలుగు రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కొంతకాలంగా రెండు భుజాల్లో ‘రొటేటర్ కఫ్’ సమస్యతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ఈ నెల 10న ఆసుపత్రిలో చేరారు. కుడి భుజానికి నిపుణులైన డాక్టర్ల బృందం దాదాపు మూడున్నర గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించింది. ప్రస్తుతం కోలుకుంటున్న ఆయన పూర్తిస్థాయిలో ఆరోగ్యవంతం కావాలంటే కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవడంతో పాటు ఫిజియోథెరపీ, డాక్టర్లు సూచించిన చికిత్సను కొనసాగించాలని సూచించారు.

చికిత్స సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసుపత్రికి వెళ్లి పవన్‌ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు పవన్ డిశ్చార్జ్ వార్తతో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ల సూచనల మేరకు ఆయన కొంతకాలం అధికారిక కార్యక్రమాలు, సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉండే అవకాశం ఉంది.

Related Articles