నీట్ (NEET) పరీక్షా వివాదం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అసలు సమస్య నీట్ పరీక్ష కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా మారుతున్న ప్రపంచంలో ప్రస్తుత విద్యా వ్యవస్థే కాలం చెల్లిందని ఆయన అభిప్రాయపడ్డారు. పుస్తకాలు బట్టీ పట్టడం, పరీక్షలు రాయడం, డిగ్రీలు సాధించడం వంటి సంప్రదాయ విద్యా విధానాన్ని పూర్తిగా మార్చాల్సిన సమయం వచ్చిందన్నారు. వైద్య విద్యను ఉదాహరణగా ప్రస్తావిస్తూ.. ఒక విద్యార్థి ఎంబీబీఎస్, పీజీ, స్పెషలైజేషన్ పూర్తి చేయడానికి దాదాపు పదేళ్లు పడుతుండగా, అదే సమాచారాన్ని ఏఐ క్షణాల్లో అందిస్తోందని చెప్పారు. ఇప్పటికే వ్యాధుల నిర్ధారణ, శస్త్రచికిత్సలు వంటి రంగాల్లో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతోందని గుర్తుచేశారు.
మారుతున్న సాంకేతిక ప్రపంచాన్ని గుర్తించకుండా పాత విద్యా విధానాన్నే కొనసాగించడం వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని వర్మ అన్నారు. సంప్రదాయ విద్యా విధానాన్ని పునఃసమీక్షించి, విద్యార్థులను ఏఐ ఆధారిత నైపుణ్యాల వైపు మళ్లించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. వర్మ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి.

