అక్కినేని అఖిల్ నటించిన ‘లెనిన్’ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆయన నటనపై సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా విడుదలైన వెంటనే ఆర్జీవీ ఎక్స్‌లో అఖిల్‌కు శుభాకాంక్షలు తెలుపగా, అఖిల్ కూడా “థ్యాంక్యూ సార్… ప్లీజ్ సినిమా చూడండి” అంటూ స్పందించాడు. అనంతరం సినిమా చూసిన ఆర్జీవీ తన అభిప్రాయాన్ని మరోసారి పంచుకున్నారు.
“ఇప్పుడే ‘లెనిన్’ చూశాను. సినిమా చాలా బాగుంది. అంతకంటే ముఖ్యంగా నువ్వు అక్కినేని కుటుంబంలోనే బెస్ట్ యాక్టర్ అని నాకు అనిపించింది. ఇది నాగార్జున మీద ఒట్టేసి చెబుతున్నా” అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. సాధారణ సన్నివేశాల్లో కూడా అఖిల్ నటన ఎంతో సహజంగా ఉందని, భావోద్వేగ సన్నివేశాల్లో అతను అద్భుతంగా నటించాడని ప్రశంసించారు.
అలాగే అఖిల్‌లోని నటుడిని కొత్త కోణంలో ఆవిష్కరించిన దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరిని కూడా ఆర్జీవీ అభినందించారు. అఖిల్‌కు ఇలాంటి బలమైన పాత్రను అందించినందుకు దర్శకుడికి ప్రత్యేకంగా ప్రశంసలు తెలిపారు.
కెరీర్ ప్రారంభం నుంచి సరైన విజయానికి ఎదురుచూస్తున్న అఖిల్‌కు ‘లెనిన్’ సినిమా కీలక మలుపుగా మారింది. బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనతో పాటు నటుడిగా కూడా ఆయనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

