విక్టరీ వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ (AK47)పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వెంకటేష్ కెరీర్‌లో 77వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతుండగా, తాజాగా మేకర్స్ ‘చిట్టిబాబు’ పాత్రకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ వీడియోలో కుటుంబ సభ్యులందరి పనులను తానే చూసుకునే వ్యక్తిగా వెంకటేష్ కనిపించారు. “నాకు ఎవరేం పని చేసినా నచ్చదు.. అన్నీ నేనే చూసుకుంటా” అనే డైలాగ్‌తో ఆయన పాత్ర స్వభావాన్ని సరదాగా పరిచయం చేశారు. ఇంట్లో జరిగే చిన్న చిన్న సంఘటనలను వినోదాత్మకంగా చూపించిన ఈ గ్లింప్స్‌లో వెంకటేష్ కామెడీ టైమింగ్, హావభావాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చివర్లో వచ్చే సంభాషణలు కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.
ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, నారా రోహిత్, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. వెంకటేష్ -త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న తొలి పూర్తి స్థాయి సినిమాగా ‘ఆదర్శ కుటుంబం’పై అభిమానుల్లో మంచి క్రేజ్ నెలకొంది. విడుదలైన చిట్టిబాబు గ్లింప్స్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది.

