తమిళ స్టార్ హీరో ధనుష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే ఊహాగానాలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల అభిమానులు నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి కారణమయ్యాయి. ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ.. అభిమాన సంఘాలు కేవలం సినిమా వేడుకలు, ఫ్యాన్స్ మీట్లకే పరిమితం కాకుండా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనాలని సూచించారు. ప్రతి ప్రాంతంలో ప్రజల అవసరాలను గుర్తించి, తమకు చేతనైన సహాయం చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. తమ సేవా కార్యక్రమాలు చూసి గర్వపడేలా పనిచేయాలని ఆయన అన్నారు.
ధనుష్ చేసిన ఈ వ్యాఖ్యలతో, ఇటీవల రాజకీయ పార్టీ స్థాపించిన విజయ్ తరహాలోనే ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందా అనే చర్చ తమిళనాట మొదలైంది. అయితే రాజకీయ ప్రవేశంపై ధనుష్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా, తన దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాయన్’ సినిమాకి జాతీయ అవార్డు రావడంపై వచ్చిన విమర్శలపైనా ధనుష్ స్పందించారు. ఆ ఏడాది ‘రాయన్’ కంటే మంచి సినిమాలు వచ్చాయని భావించిన వారి అభిప్రాయాన్ని తాను గౌరవిస్తానని చెప్పారు. గతంలో ‘వడ చెన్నై’, ‘కర్ణన్’, ‘మరియాన్’ వంటి సినిమాలకు అవార్డులు వస్తాయని ఆశించినా రాలేదని గుర్తుచేశారు. విమర్శలను సానుకూలంగా స్వీకరిస్తానని, జాతీయ అవార్డు రావడం మాత్రం తనకు ఎంతో ప్రత్యేకమైన గుర్తింపని ధనుష్ పేర్కొన్నారు.

