ప్రకాష్‌రాజ్‌కు బండ్ల గణేష్ కౌంటర్

ప్రకాష్‌రాజ్‌కు బండ్ల గణేష్ కౌంటర్

యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ కేసుపై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు నిర్మాత బండ్ల గణేష్ ఘాటుగా స్పందించడంతో సోషల్ మీడియాలో కొత్త వివాదానికి తెరలేచింది.

పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ప్రశ్న రావణ్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు స్పందించిన ప్రకాష్ రాజ్, తాజాగా మరో వీడియో విడుదల చేస్తూ ప్రభుత్వ తీరును విమర్శించారు. “మీరు ఆట మొదలు పెట్టారు… ప్రజలు దానికి ముగింపు ఇస్తారు. Game On” అంటూ పోస్టు చేశారు. వరుస కేసులతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలపై బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. ప్రకాష్ రాజ్‌కు ప్రస్తుతం సినిమాలు, షూటింగ్‌లు లేవని వ్యాఖ్యానిస్తూ, ఇతరుల గురించి మాట్లాడటానికి బదులుగా తన పనిపై దృష్టి పెట్టాలని సూచించారు. అనవసర పోస్టులు, వివాదాలతో తన ప్రతిష్ఠను తానే దెబ్బతీసుకోవద్దని పేర్కొన్నారు. అలాగే వ్యక్తిగత వ్యాఖ్యలతో కూడిన ఘాటు పోస్టును కూడా షేర్ చేశారు.

ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన మద్దతుదారులు బండ్ల గణేష్ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతుండగా, మరోవైపు ప్రకాష్ రాజ్‌కు మద్దతుగా నిలిచిన వారు ఆయన భావప్రకటన స్వేచ్ఛలో భాగంగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించారని అంటున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య సోషల్ మీడియాలో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రశ్న రావణ్ అరెస్ట్ కంటే ప్రకాష్ రాజ్, బండ్ల గణేష్ మధ్య మాటల యుద్ధమే ఎక్కువగా హాట్ టాపిక్‌గా మారింది.

Related Articles