సనాతన ధర్మం, పురాతన ఆలయాల రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన సోషియో ఫాంటసీ అడ్వెంచర్ సినిమా ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోతోంది. అభిషేక్ నామా దర్శకత్వంలో విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ పాన్ ఇండియా సినిమా జులై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాపై విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ, ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది.
బలహీనమైన కథనం, నెమ్మదిగా సాగే స్క్రీన్‌ప్లే, ఎక్కువ రన్‌టైమ్ ప్రధాన మైనస్‌లుగా మారాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రేక్షకుల స్పందన దృష్ట్యా చిత్రబృందం సినిమా నిడివిని దాదాపు 20 నిమిషాలు తగ్గించినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించలేదు.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,100 స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమా తొలి మూడు రోజుల్లో భారతదేశంలో కేవలం రూ.9.75 కోట్ల నెట్ వసూళ్లను మాత్రమే నమోదు చేసింది. ఓవర్సీస్‌తో పాటు గ్రాస్ కలెక్షన్లు కలిపి తొలి వీకెండ్ ముగిసే సమయానికి ప్రపంచవ్యాప్తంగా రూ.15 కోట్లలోపే వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. జగపతి బాబు, అనసూయ భరద్వాజ్ తదితర ప్రముఖులు నటించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ‘నాగబంధం’కు ఆశించిన ఆదరణ లభించడం లేదు. ప్రస్తుతం సినిమా కోలుకోవడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

