హారర్, మిస్టరీ థ్రిల్లర్ సినిమా అభిమానులను ఆకట్టుకున్న ‘మా ఊరి పొలిమేర’ ఫ్రాంచైజీ ఇప్పుడు మూడో భాగంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి సినిమా చిత్రం ఓటీటీలో సంచలన విజయాన్ని అందుకోగా, రెండో భాగం థియేటర్లలో మంచి వసూళ్లు సాధించి ఈ సిరీస్‌కు మరింత క్రేజ్ తీసుకొచ్చింది. దీంతో ‘పొలిమేర 3’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం కీలక ప్రకటన చేసింది. సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. “Action Meets Power” అనే ట్యాగ్‌లైన్‌తో విడుదల చేసిన ప్రత్యేక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అర్జున్ ఎంట్రీతో కథ మరింత విభిన్నంగా, భారీ కాన్వాస్‌పై సాగనున్నట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి.
దర్శకుడు అనిల్ విశ్వనాథ్ రూపొందించిన ఈ ఫ్రాంచైజీలో గ్రామీణ నేపథ్యంలో సాగే మిస్టరీ, చేతబడులు, హారర్ అంశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరో సత్యం రాజేష్ నటన కూడా ఈ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు మూడో భాగంలో అర్జున్ సర్జా చేరడంతో హారర్‌తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ కూడా కీలకంగా ఉండనున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం ఇంకా వెల్లడించలేదు. దీంతో ‘పొలిమేర 3’పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

