బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం ముంబైలో రూ.84 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట్ రికార్డుల ప్రకారం జులై 14న ఈ ఆస్తి రిజిస్ట్రేషన్ పూర్తికాగా, స్టాంప్ డ్యూటీగా సుమారు రూ.5.04 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఈ ప్రాపర్టీ మొత్తం 1,017.60 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 193.12 చదరపు మీటర్ల నిర్మిత ప్రాంతంతో కూడిన ప్రధాన బంగ్లాతో పాటు 31.50 చదరపు మీటర్ల అవుట్‌హౌస్ కూడా ఉంది. ముంబైలో ప్రముఖ సినీ తారలు, వ్యాపారవేత్తలు నివసించే బాంద్రా వెస్ట్ ప్రాంతంలో స్వంత స్థలంతో కూడిన బంగ్లాలు చాలా అరుదుగా లభిస్తాయి. దీంతో జాన్ అబ్రహం చేసిన ఈ భారీ కొనుగోలు ప్రస్తుతం సినీ, రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
జాన్ అబ్రహం రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి కాదు. 2023 డిసెంబర్లో కూడా ముంబైలోని ఖార్ ప్రాంతంలో రూ.70.83 కోట్ల విలువైన మరో బంగ్లాను కొనుగోలు చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ‘ది డిప్లొమాట్’, ‘తెహ్రాన్’ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన జాన్ ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా బయోపిక్‌తో పాటు సూపర్ హిట్ యాక్షన్ ఫ్రాంచైజ్ ‘ఫోర్స్ 3’లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలలోనూ ఆయన పోలీస్ అధికారిగా కనిపించనున్నారు.

