అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ సినిమా విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సక్సెస్ మీట్లో నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కథను అంగీకరించినప్పుడే అఖిల్ తన దృష్టిలో హీరో అయ్యాడని ప్రశంసించారు. ‘‘ఈ కథ విన్నప్పుడు ఒక నటుడిగా నాకు భయం వేసింది. ఇలాంటి పాత్ర చేయాలంటే చాలా అనుభవం అవసరం. కానీ అఖిల్ కథను నమ్మి ధైర్యంగా ఒప్పుకున్నాడు. నిజ జీవితంలో అతని వ్యక్తిత్వానికి సినిమాలోని పాత్రకు ఎలాంటి సంబంధం లేదు. ఈ సినిమా కోసం అతడు ఎంత కష్టపడ్డాడో నేను దగ్గర నుంచి చూశాను. ఒక అన్నయ్యగా, అభిమానిగా అతడిని చూస్తుంటే గర్వంగా ఉంది’’ అని నాగచైతన్య అన్నారు.
తండ్రి నాగార్జున గురించి మాట్లాడుతూ.. ‘‘నాన్న ఏదైనా సవాలుగా తీసుకుంటే దాన్ని పూర్తిచేసే వరకు వెనక్కి తగ్గరు. ‘మనం’, ‘బంగార్రాజు’ సినిమాల సమయంలో ఆయనలో ఆ తపన చూశాను. ఇప్పుడు ‘లెనిన్’ విషయంలోనూ అదే కనిపించింది. లవ్ స్టోరీల ట్రెండ్‌లో ఇలాంటి కథను ప్రేక్షకులు ఆదరిస్తారా అని నేను అడిగితే.. ‘నేను చేసి చూపిస్తా’ అని ధైర్యంగా చెప్పారు. ఆయనలోని ఆ ఆత్మవిశ్వాసమే నాకు స్ఫూర్తి’’ అని నాగచైతన్య పేర్కొన్నారు.

