‘సింహాద్రి’ విజయం వెనుక ఆ సీన్: రాజమౌళి

‘సింహాద్రి’ విజయం వెనుక ఆ సీన్: రాజమౌళి

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ‘వారణాసి’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన ఓ ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ‘సింహాద్రి’ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘సింహాద్రి’ సినిమాలో హీరో ఒక మంచి వ్యక్తిని చంపే సన్నివేశంపై అప్పట్లో తన కుటుంబ సభ్యులు, చిత్రబృందంలో చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారని రాజమౌళి తెలిపారు. హీరో చేత అలాంటి పని చేయించడం ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారనే సందేహాలు వ్యక్తమయ్యాయని చెప్పారు.

అయితే కథ ప్రకారం ఆ పాత్రను చంపకపోతే వేలాది మంది అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని, అందుకే ఆ సన్నివేశం కథకు అత్యంత కీలకమని తాను నమ్మానని వివరించారు. ఆ ఎమోషన్‌ను బలంగా చూపించగలిగితే ప్రేక్షకులు తప్పకుండా అర్థం చేసుకుంటారని విశ్వసించినట్లు చెప్పారు.

ఆ సన్నివేశాన్ని ఉంచాలా, తొలగించాలా అనే అంశంపై ఇంట్లోనూ, చిత్రబృందంలోనూ చర్చలు, వాదనలు జరిగినప్పటికీ చివరకు దానిని చిత్రీకరించామని రాజమౌళి తెలిపారు. ఆ సన్నివేశం ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేయడమే కాకుండా సినిమా విజయానికి కూడా కీలకంగా నిలిచిందన్నారు. దర్శకుడిగా కథపై నమ్మకం ఉంటే కొన్ని సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు.

Related Articles