నోలన్ కొత్త మూవీ టాక్

నోలన్ కొత్త మూవీ టాక్

సినిమా : ది ఒడిస్సీ, దర్శకుడు: క్రిస్టఫర్ నోలన్, నటీనటులు: మాట్ డామన్, టామ్ హాలెండ్, అన్నీ హథవే, రాబర్ట్ ప్యాటిన్సన్ తదితరులు.

వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే క్రిస్టఫర్ నోలన్, ఈసారి గ్రీకు పురాణ గాథ ‘ది ఒడిస్సీ’ని వెండితెరపై ఆవిష్కరించారు. ట్రోజన్ యుద్ధంలో విజయం సాధించిన రాజు ఒడిస్సియస్ తన రాజ్యం ఇథాకాకు తిరిగి చేరే క్రమంలో ఎదుర్కొన్న ప్రమాదాలు, దేవతల ఆగ్రహం, కుటుంబాన్ని చేరుకునేందుకు చేసిన పోరాటమే కథ.

నోలన్ తనదైన నాన్- లీనియర్ శైలిలో కథను ఆసక్తికరంగా చెప్పాడు. ట్రాయ్ యుద్ధం, సముద్ర ప్రయాణంలో ఒంటి కన్ను రాక్షసుడితో పోరాటం, సుడిగుండాలు, ఇతర సాహస ఘట్టాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ప్రతి ఎపిసోడ్‌లో భావోద్వేగంతో పాటు ఉత్కంఠను నిలబెట్టడంలో దర్శకుడు విజయం సాధించాడు. అయితే ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగిన భావన కలుగుతుంది.

ఒడిస్సియస్ పాత్రలో మాట్ డామన్ అద్భుతంగా నటించాడు. అన్నీ హథవే, టామ్ హాలెండ్, రాబర్ట్ ప్యాటిన్సన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. భారతీయ నటుడు హిమేష్ పటేల్ కూడా ఆకట్టుకున్నాడు.

సాంకేతికంగా సినిమా అత్యున్నత స్థాయిలో నిలిచింది. హోయ్టే వాన్ హోయ్టేమా సినిమాటోగ్రఫీ, లుడ్విగ్ గోరాన్సన్ సంగీతం సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. వాస్తవికతకు దగ్గరగా ప్రతి సన్నివేశాన్ని తెరకెక్కించడంలో నోలన్ విజన్ స్పష్టంగా కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్: కథ, స్క్రీన్‌ప్లే, నటీనటుల నటన, దర్శకత్వం, విజువల్స్.
మైనస్: ద్వితీయార్ధంలో కొన్ని నెమ్మదైన సన్నివేశాలు.

తీర్పు: అద్భుతమైన విజువల్స్, బలమైన కథనం, భావోద్వేగాలతో క్రిస్టఫర్ నోలన్ మరోసారి తన మార్క్ చూపించారు. ‘ది ఒడిస్సీ’ తప్పక చూడదగ్గ ఎపిక్ అడ్వెంచర్ డ్రామా.

Related Articles