అన్షు, వాసవి గణేషన్ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘హుషారు పిట్టలు’ నుంచి ‘టోంగా.. టోంగా’ అనే మాస్ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. చరణ్ అర్జున్ సంగీతం అందించిన ఈ పాటకు ఎస్.ఎస్. చిరంజన్ సాహిత్యం అందించగా, ఉత్సాహభరితమైన బీట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బిక్షు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని వెంకట్ యాదవ్ నిర్మించారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15న థియేటర్లలో విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు ఈ సినిమాని విడుదల చేస్తున్నాయి.
పాట విడుదల కార్యక్రమంలో దర్శకుడు బిక్షు మాట్లాడుతూ, టీజర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో విమర్శలు ఎదురైనా, సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల అభిప్రాయం పూర్తిగా మారుతుందని అన్నారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని, వాసవి పోషించిన పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు.
హీరో అన్షు మాట్లాడుతూ, మంగ్లీ పాడిన ఈ పాట సినిమాకు మంచి బలం చేకూరుస్తుందని అన్నారు. టీజర్‌ను చూసి కొందరు అపార్థం చేసుకున్నారని, కానీ సినిమా చూసిన తర్వాత అందరి అభిప్రాయం మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. హీరోయిన్ వాసవి గణేషన్ కూడా టీజర్‌పై వచ్చిన విమర్శలను ప్రస్తావిస్తూ, సినిమాలోని తన పాత్రను చూసిన తర్వాత ప్రేక్షకులు తప్పకుండా మెచ్చుకుంటారని అన్నారు.
నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ, సినిమా చూసిన తర్వాత ఎంతో ఆకట్టుకుందని, ఆగస్టు 15న విడుదలకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ ఈ సినిమాకి చేసిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు.
నిర్మాత వెంకట్ యాదవ్ మాట్లాడుతూ, ఇది అన్ని భావోద్వేగాలతో కూడిన మంచి కథ అని, విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి తప్పకుండా ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉందన్నారు. ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు ఈ సినిమాని విడుదల చేయడం సినిమాపై తమ నమ్మకానికి నిదర్శనమని తెలిపారు. చిత్రబృందం మొత్తం ‘హుషారు పిట్టలు’ ప్రేక్షకులను అలరిస్తుందనే ధీమా వ్యక్తం చేసింది.

