అభిమానిని కలిసిన అఖిల్

అభిమానిని కలిసిన అఖిల్

అక్కినేని అఖిల్ తన అభిమానిపై చూపిన ఆప్యాయత మరోసారి అందరి ప్రశంసలు అందుకుంటోంది. సోషల్ మీడియాలో ‘అయ్యగారే నెంబర్ వన్’ అంటూ గుర్తింపు పొందిన గుంటూరుకు చెందిన వీరాభిమాని నాగరాజును అఖిల్ వ్యక్తిగతంగా కలుసుకుని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన భావోద్వేగ క్షణాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇటీవల విడుదలైన ‘లెనిన్’ సినిమా సందర్భంగా నాగరాజు థియేటర్ల వద్ద అఖిల్ కటౌట్‌లకు పాలాభిషేకాలు చేయడం, ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఆ వీడియోలు వైరల్ కావడంతో అఖిల్ దృష్టికి చేరాయి. అప్పుడే అవకాశం దొరికితే నాగరాజును తప్పకుండా కలుస్తానని ఆయన హామీ ఇచ్చారు.
తాజాగా నాగరాజును ప్రత్యేకంగా ఆహ్వానించిన అఖిల్, అభిమానిని ఆత్మీయంగా పలకరించారు. హీరోను ప్రత్యక్షంగా చూసిన ఆనందంలో నాగరాజు భావోద్వేగానికి గురై కాళ్లపై పడేందుకు ప్రయత్నించగా, అఖిల్ వెంటనే అతన్ని ఆపి ఆలింగనం చేసుకున్నారు. దీంతో నాగరాజు కన్నీళ్లు పెట్టుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
ఈ వీడియోను అన్నపూర్ణ స్టూడియోస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకోగా, అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. స్టార్‌డమ్ వచ్చిన తర్వాత కూడా అభిమానులకు విలువ ఇవ్వడం అభినందనీయమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. సాధారణంగా పండ్ల వ్యాపారం చేసుకునే నాగరాజు, సినిమా విడుదల సమయంలో మాత్రమే అభిమానిగా సందడి చేస్తుంటాడు. ఇతర హీరోల అభిమానులతో వివాదాలకు దూరంగా ఉంటూ తన అభిమానాన్ని హుందాగా వ్యక్తపరచడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది.

Related Articles