అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిరం విరాళాల చోరీ వ్యవహారంపై బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. రామ మందిరం విరాళాల కుంభకోణం కంటే మొఘలుల కాలంలో దేవాలయాలపై జరిగిన దోపిడీలు, విధ్వంసమే పెద్ద విషాదమని ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో అనుపమ్ ఖేర్ మరోసారి స్పందించారు. కాషాయ కండువాతో విడుదల చేసిన వీడియోలో తాను పూర్తి బాధ్యతతోనే ఆ వ్యాఖ్యలు చేశానని, చెప్పిన ప్రతి మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. కొందరు తన మాటలను వక్రీకరించి వివాదాస్పదంగా చూపిస్తున్నారని ఆరోపించారు.
నిజాన్ని ప్రజలు తమ కోణంలో చూడకుండా ఎజెండాలకు అనుగుణంగా అర్థం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ట్రోల్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు లేదా రాజకీయ నాయకుల విమర్శలకు తాను భయపడబోనని, గతంలో ఎలా మాట్లాడానో ఇకపై కూడా తనకు సరైనదనిపించిన విషయాన్నే చెబుతానని తెలిపారు. చివరగా ‘జై శ్రీరామ్’ అంటూ తన వీడియోను ముగించారు.

