మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. దర్శకుడు శశాంక్ యేలేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాని శోభు యార్లగడ్డ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫహాద్ తొలిసారిగా పూర్తి స్థాయి తెలుగు పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్లో ఫహాద్ ఫాజిల్ ఓ మెజీషియన్ పాత్రలో కనిపిస్తారు. ఓ చిన్నారికి మ్యాజిక్ ట్రిక్స్ చూపిస్తూ ఆమెను మాయంచేసే ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ తర్వాత పరిస్థితులు అనూహ్యంగా మారిపోతాయి. సాధారణంగా కనిపించిన ఆ చిన్నారి విచిత్రంగా ప్రవర్తిస్తూ అతీత శక్తులను ప్రదర్శిస్తుంది. దీంతో భయపడిన మెజీషియన్ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ చిన్నారి అతడిని వెంటాడుతూ కనిపించడం టీజర్‌కు థ్రిల్లింగ్ టచ్‌ను తీసుకొచ్చింది.
హారర్, ఫాంటసీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాల మేళవింపుతో రూపొందిన టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా చివర్లో వచ్చే విజువల్స్, నేపథ్య సంగీతం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్‌తో పాటు సారా పాలేకర్, సౌరభ్ సచ్దేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విభిన్న కథాంశంతో రూపొందుతున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా సెప్టెంబర్ 11న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

