దక్షిణాది గానకోకిల, ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ ఎస్. జానకి (88) మరణంతో భారతీయ సినీ సంగీత ప్రపంచం ఓ గొప్ప గానమూర్తిని కోల్పోయింది. వయోభారం, వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం సాయంత్రం కర్ణాటకలోని మైసూరులో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతివార్త అభిమానులు, సినీ ప్రముఖులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆమెకు కడసారి నివాళులర్పించేందుకు ఆదివారం ఉదయం నుంచి మైసూర్ మహారాజ కాలేజీ మైదానంలో పార్థివ దేహాన్ని ప్రజల ముందు సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం 3 గంటల వరకు అభిమానులు, బంధుమిత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆమెను సందర్శించి నివాళులర్పించారు. సందర్శకుల రద్దీ దృష్ట్యా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.
మధ్యాహ్నం అనంతరం మహారాజ కాలేజీ మైదానం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటలకు మైసూరు బోగాది సమీపంలోని కణియర హుండి గ్రామంలోని ఆమె ఫామ్‌హౌస్‌లో కర్ణాటక ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జానకమ్మ మృతి పట్ల ఆమె మనవరాలు అప్సరా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ, “మా నాన్నమ్మ ప్రశాంతంగా మమ్మల్ని విడిచివెళ్లారు. ఆమె పాటలు కోట్లాది మందికి ఆనందాన్ని పంచాయి” అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పల్లపట్ల గ్రామంలో జన్మించిన ఎస్. జానకి, 1957లో తమిళ చిత్రం విధియిన్ విళయాట్టుతో గాన ప్రస్థానం ప్రారంభించారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సహా 20కి పైగా భారతీయ భాషల్లో సుమారు 48 వేల పాటలు ఆలపించి అరుదైన గుర్తింపు పొందారు. భావోద్వేగాలను గాత్రంలో అద్భుతంగా పలికించగలిగిన గాయనిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 48 వేల సంఖ్య పాటలు తప్పుగా వినబడుతోంది ఎందుకంటే ఒక ఛానల్ లో దాదాపు 70 వేల పాటలు పాడినట్లు వినబడుతోంది.
ఆమె ప్రతిభకు గుర్తింపుగా నాలుగు జాతీయ ఉత్తమ గాయని అవార్డులు, 33 రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు లభించాయి. 2013లో ప్రకటించిన పద్మభూషణ్‌ను ఆలస్యంగా గుర్తింపు లభించిందనే కారణంతో ఆమె సున్నితంగా తిరస్కరించారు. జానకి మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్‌తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ నివాళులర్పించారు. ఎస్. జానకి భౌతికంగా దూరమైనా, ఆమె ఆలపించిన వేలాది మధుర గీతాలు సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

