‘లెనిన్’కు సమంత ఆల్ ది బెస్ట్

‘లెనిన్’కు సమంత ఆల్ ది బెస్ట్

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ సినిమా విడుదల సందర్భంగా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ సమంత చేసిన సోషల్ మీడియా పోస్ట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. సినిమా విడుదల రోజున ‘లెనిన్’ ట్రైలర్‌ను షేర్ చేసిన సమంత.. “ఇప్పటికే బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయి. మొత్తం చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్” అంటూ శుభాకాంక్షలు తెలిపింది. ముఖ్యంగా అఖిల్‌కు కూడా విజయం కోరుతూ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వ్యక్తిగత జీవితంలో మార్పులు వచ్చినప్పటికీ, వృత్తిపరంగా పరస్పరం ప్రోత్సహించుకోవడం అభినందనీయమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇటీవల సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా గురించి ‘లెనిన్’ ప్రమోషన్స్ సందర్భంగా అఖిల్ కూడా ప్రశంసలు కురిపించారు. షూటింగ్ కారణంగా సినిమా చూడలేకపోయానని, మహిళా ప్రధాన కథలో యాక్షన్‌కు ప్రాధాన్యం ఇవ్వడం తనకు నచ్చిందని, సమంతకు మంచి విజయం దక్కడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు.

ఇప్పుడు అఖిల్ సినిమాకు సమంత కూడా శుభాకాంక్షలు తెలియజేయడంతో ఇద్దరి మధ్య ఉన్న పరస్పరమైన గౌరవం మరోసారి చర్చనీయాంశమైంది. సమంత, నాగచైతన్య వ్యక్తిగతంగా వేర్వేరు మార్గాలు ఎంచుకున్నప్పటికీ, సినీ పరిశ్రమలో వృత్తిపరమైన మర్యాదను కొనసాగిస్తున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే, ‘లెనిన్’ సినిమాకి తొలి షోల నుంచే పాజిటివ్ టాక్ లభిస్తోంది. అఖిల్ నటన, ఎమోషనల్ కథనం, యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సమంత చేసిన ఈ పోస్ట్ కూడా సినిమాకు మరింత ప్రచారం తీసుకొచ్చిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Related Articles