శోభన్ బాబు సతీమణి శాంతకుమారికి తుది వీడ్కోలు

శోభన్ బాబు సతీమణి శాంతకుమారికి తుది వీడ్కోలు

దివంగత తెలుగు అగ్రనటుడు శోభన్ బాబు సతీమణి శాంతకుమారి (86) గురువారం చెన్నైలో కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను నాలుగు రోజుల క్రితం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతున్న సమయంలో ఆప్తమిత్రురాలితో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

శోభన్ బాబు, శాంతకుమారిల వివాహం 1958 మే 15న జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు మృదుల, ప్రశాంతి, నివేదితతో పాటు కుమారుడు కరుణ శేషు ఉన్నారు. సినీ రంగంలో శోభన్ బాబు అగ్రహీరోగా ఎదిగిన సమయంలో కూడా శాంతకుమారి ఎప్పుడూ ప్రచారానికి దూరంగా ఉంటూ కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ ఆయనకు అండగా నిలిచారని సన్నిహితులు గుర్తు చేస్తున్నారు.

2008లో శోభన్ బాబు గుండెపోటుతో మరణించిన తర్వాత శాంతకుమారి చెన్నైలో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తూ ప్రజా జీవితానికి దూరంగా ఉన్నారు. ఇటీవల వరకు ఆమె ఆరోగ్యంగా కనిపించినప్పటికీ, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి కన్నుమూశారు.

శాంతకుమారి పార్థివదేహాన్ని చెన్నైలోని వారి నివాసానికి తరలించారు. నేడు (శుక్రవారం) కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

శాంతకుమారి మృతిపట్ల సినీ ప్రముఖులు, నిర్మాతలు, నటీనటులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. శోభన్ బాబు విజయాల వెనుక ఆమె పాత్ర ఎంతో ముఖ్యమని, కుటుంబాన్ని సమర్థంగా నడిపిస్తూ ఆయనకు ఎప్పుడూ బలంగా నిలిచారని సినీ వర్గాలు నివాళులర్పిస్తున్నాయి.

Related Articles