హీరో నవీన్ పొలిశెట్టి తన హాస్యంతో మరోసారి అందరినీ అలరించారు. మల్కాజ్‌గిరిలో నిర్వహించిన పోలీస్ గేమ్స్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, పోలీసు అధికారులతో సరదాగా ముచ్చటిస్తూ నవ్వులు పూయించారు. ఈ సందర్భంగా తాను త్వరలో ఓ సినిమాలో పోలీస్ అధికారిగా నటించబోతున్నట్లు వెల్లడించారు. అనంతరం మల్కాజ్గిరి సీపీ సుమతిని ఉద్దేశించి, మహిళల భద్రత కోసం ఆమె నిర్వహించిన అండర్‌కవర్ ఆపరేషన్‌ను ప్రశంసించారు. “మేడమ్ మీరు చాలా బాగా నటించారు. మా సినిమాలో కూడా ఒక పాత్ర చేయండి. ‘ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ’ సీక్వెల్లో మనిద్దరం కలిసి ఓ కేసు చేద్దాం” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
అలాగే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ను ఉద్దేశించి, “సార్.. సినిమాలో గన్ ఎలా పట్టుకోవాలో నాకు నేర్పించండి” అని కోరారు. దీనికి సీవీ ఆనంద్ స్పందిస్తూ, “ట్రైనింగ్ ఇస్తాం.. కానీ అసలు బుల్లెట్లతో కాదు” అంటూ చమత్కరించారు.
దానికి నవీన్ పొలిశెట్టి, “మా సినిమాల్లో అన్నీ ఫేక్ బుల్లెట్లే సార్. నిజం చెప్పాలంటే నాకు గన్ పట్టుకోవడం కూడా రాదు” అని చెప్పడంతో అక్కడున్న పోలీస్ అధికారులు, అతిథులు నవ్వుల్లో మునిగిపోయారు. నవీన్ పొలిశెట్టి చేసిన ఈ సరదా వ్యాఖ్యలు, పోలీసు అధికారులతో ఆయన ముచ్చట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

