నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘దసరా’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. నాని ‘జడల్’ అనే మాస్ పాత్రలో నటిస్తుండగా, కయాదు లోహర్ హీరోయిన్‌గా కనిపించనుంది. మోహన్ బాబు విలన్ పాత్రలో నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో సినిమా విడుదల ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 25కు మారే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
‘ది ప్యారడైజ్’ను సమయానికి పూర్తి చేయాలనే ఉద్దేశంతో నాని తన తదుపరి ప్రాజెక్టులను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు సమాచారం. ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్ సిద్ధం చేసిన కథకు డేట్లు కుదరకపోవడంతో ఆ ప్రాజెక్ట్‌ను వదులుకున్నట్లు టాక్. అలాగే ‘జై భీమ్’ దర్శకుడు టీజే జ్ఞానవేల్‌తో చేయాల్సిన సినిమా కూడా డేట్ల సమస్య కారణంగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
నిర్మాతపై అదనపు భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో నాని ప్రస్తుతం పూర్తిగా ‘ది ప్యారడైజ్’పైనే దృష్టి పెట్టినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం పూర్తయ్యాక దర్శకుడు సుజీత్‌తో ‘బ్లడీ రోమియో’ ప్రాజెక్ట్ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

