సల్మాన్ సినిమాకు సెన్సార్ షాక్

సల్మాన్ సినిమాకు సెన్సార్ షాక్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మాతృభూమి’ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. ఆగస్టులో విడుదల చేయాలని భావించిన ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) నుంచి సెన్సార్ సర్టిఫికెట్ ప్రస్తుతానికి నిలిపివేసినట్లు సమాచారం. దీంతో సినిమా విడుదల మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉన్నా, కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఇటీవల సెన్సార్ బోర్డు సూచనల మేరకు సినిమాలోని ‘చైనా’ అనే పదాన్ని తొలగిస్తూ కొన్ని సన్నివేశాలను రీషూట్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయినప్పటికీ సర్టిఫికెట్ ఇంకా జారీ కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంపై చిత్రబృందం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

2020లో భారత్- చైనా మధ్య జరిగిన గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో ఈ సినిమాని రూపొందించారు. తొలుత ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ అనే టైటిల్‌ను ప్రకటించగా, తర్వాత దానిని ‘మాతృభూమి’గా మార్చారు. అలాగే రక్షణ మంత్రిత్వశాఖ సూచనల మేరకు దర్శకుడు అపూర్వ లఖియా సినిమాలో కీలక మార్పులు చేసినట్లు సమాచారం. దాదాపు 40 శాతం చిత్రాన్ని రీషూట్ చేసి, కథలో కొన్ని కల్పిత అంశాలు, రొమాంటిక్ సన్నివేశాలు జోడించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

Related Articles