సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 2023లో వచ్చిన ‘జైలర్’ రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో, సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన రిలీజ్ డేట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్, ఎస్.జే. సూర్య, మిథున్ చక్రవర్తి, యోగి బాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే విద్యా బాలన్ కోలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హృతిక్ రోషన్ అతిథి పాత్రలో కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ‘జైలర్ 2’కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ అక్టోబర్ 16న విడుదల కానుండటంతో, వరుసగా రెండు రోజుల్లో రెండు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దీంతో దసరా బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్-చిరంజీవి మధ్య పోటీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.

