అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన తాజా చిత్రం ‘లెనిన్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. జులై 10న విడుదల కానున్న ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, ఇటీవల విడుదలై విజయాన్ని అందుకున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రమోషన్స్ బిజీ కారణంగా ఇంకా సినిమా చూడలేదని, అయితే ట్రైలర్ మాత్రం చూసానని అఖిల్ తెలిపారు. ట్రైలర్ చాలా ఆకట్టుకుందని, చూసినప్పుడే సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగిందన్నారు. కుటుంబ భావోద్వేగాలతో పాటు పవర్‌ఫుల్ యాక్షన్‌ను మేళవించిన కాన్సెప్ట్ ఎంతో కొత్తగా అనిపించిందని ప్రశంసించారు.
ముఖ్యంగా మహిళా ప్రధాన పాత్రతో అలాంటి యాక్షన్ సన్నివేశాలు రూపొందించడం విశేషమని పేర్కొన్నారు. సమంత తన పాత్రలో అద్భుతంగా నటించిందని కొనియాడుతూ, ఆమెతో పాటు చిత్రబృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. “కంగ్రాట్స్ సామ్” అంటూ సమంతకు శుభాకాంక్షలు చెప్పిన అఖిల్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

