ఫోక్ సాంగ్స్, డ్యాన్స్ ప్రదర్శనలతో గుర్తింపు పొందిన నాగదుర్గ, ఇప్పుడు ‘ఇడుపు కాయితం’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు వర్క్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఇందులో ఆమె తెలంగాణ యువతి ‘శ్రీలత’ పాత్రలో కనిపించనుంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగదుర్గ మాట్లాడుతూ, తనకు బిగ్‌బాస్ తెలుగు నుంచి ఆఫర్ వచ్చిన విషయం నిజమేనని తెలిపింది. అయితే తాను ఆ షోకు సరిపోనని భావించి గౌరవంగా తిరస్కరించినట్లు వెల్లడించింది. తాను చాలా సైలెంట్‌గా ఉంటానని, ఎవరికైనా ‘నో’ చెప్పడం కూడా కష్టంగా ఉంటుందని చెప్పింది. తన భావాల కంటే ఎదుటివారి భావాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కొన్ని సందర్భాల్లో తానే బాధపడిన సందర్భాలు ఉన్నాయని పేర్కొంది.
బిగ్‌బాస్ ఆఫర్‌పై కుటుంబ సభ్యులు భిన్నంగా స్పందించారని నాగదుర్గ తెలిపింది. షోలోని పరిస్థితులను తట్టుకోవడం కష్టమని తల్లి చెప్పగా, కనీసం కొన్ని వారాలైనా హౌస్‌లో ఉంటే గుర్తింపు పెరుగుతుందని తండ్రి సూచించారని వెల్లడించింది. అయితే ప్రస్తుతం తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని, ఒకేసారి రెండు విషయాలపై దృష్టి పెట్టడం ఇష్టం లేకే బిగ్‌బాస్ అవకాశాన్ని వదులుకున్నానని నాగదుర్గ స్పష్టం చేసింది.

