ఆమిర్‌తో విభేదాలకు ఫుల్‌స్టాప్

ఆమిర్‌తో విభేదాలకు ఫుల్‌స్టాప్

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ త్వరలో తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోనున్న నేపథ్యంలో, ఆయన కుటుంబంలో ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న విభేదాలకు ముగింపు పలికే పరిణామం చోటుచేసుకుంది. ఆమిర్ సోదరుడు ఫైసల్ ఖాన్ గతంలో కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన ఫైసల్, ముందుగా తన తల్లికి, అనంతరం కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ఆమిర్ ఖాన్‌కు క్షమాపణలు చెబుతున్నానన్నారు. కోపం, బాధలో అనేక మాటలు మాట్లాడానని, ఇప్పుడు ఎవరు సరైందో, ఎవరు తప్పో నిరూపించుకోవడం కంటే కుటుంబ బంధాలను తిరిగి బలోపేతం చేయడమే తన లక్ష్యమని వెల్లడించారు. ఆధ్యాత్మిక ఆలోచనలు తనలో మార్పు తీసుకొచ్చాయని, కుటుంబ విలువను అర్థం చేసుకునేలా చేశాయని చెప్పారు.

గతేడాది ఫైసల్‌ ఖాన్ తన కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఏడాది పాటు ఆమిర్ ఖాన్ తనను గదిలో బంధించాడని, తనకు మానసిక వ్యాధి ఉందని ఇతరులను నమ్మించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అయితే తాజాగా ఆయన చెప్పిన క్షమాపణలతో ఆ కుటుంబ వివాదానికి తెరపడినట్లు బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Related Articles