ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించిన బెంగాలీ నటి రచనా బెనర్జీ ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్నారు. 1997లో ‘నేను ప్రేమిస్తున్నాను’ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె, ‘కన్యాదానం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం ‘మావిడాకులు’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 2002 తర్వాత టాలీవుడ్‌కు దూరమైన ఆమె బెంగాలీ, ఒరియా, తమిళ, కన్నడ చిత్రాల్లో నటిస్తూ కెరీర్‌ను కొనసాగించారు.
కోల్‌కతాకు చెందిన రచనా బెనర్జీ 1991లో మిస్ కోల్‌కతా కిరీటాన్ని గెలుచుకోగా, 1992లో మిస్ ఇండియా పోటీల్లోనూ పాల్గొన్నారు. 1993లో బెంగాలీ చిత్రం ‘దాన్ ప్రతిదాన్’తో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ముఖ్యంగా ఒరియా చిత్ర పరిశ్రమలో 50కి పైగా సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు సంపాదించారు.
సినీ జీవితానంతరం రాజకీయాల్లోకి వచ్చిన రచనా బెనర్జీ, పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. వ్యక్తిగత జీవితంలో ఒరియా నటుడు సిద్ధాంత్ మహాపాత్రను వివాహం చేసుకున్న ఆమె, తర్వాత విడాకులు తీసుకున్నారు. అనంతరం ప్రొబల్ బసుతో రెండో వివాహం చేసుకున్నా, 2016లో విడిపోయారు. ప్రస్తుతం రాజకీయాలతో పాటు ప్రజా సేవలో బిజీగా కొనసాగుతున్నారు.

