‘చౌహాన్’కు క్షత్రియ పరిషత్ హెచ్చరిక

‘చౌహాన్’కు క్షత్రియ పరిషత్ హెచ్చరిక

అజయ్ దేవ్‌గణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘చౌహాన్’ సినిమా టీజర్ విడుదలైన తర్వాత వివాదం చెలరేగింది. టీజర్‌లో వినిపించిన “పఠానులకు చెప్పండి, చౌహాన్ వస్తున్నాడు” అనే డైలాగ్‌పై క్షత్రియ పరిషత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బహిరంగ లేఖ విడుదల చేసింది. ఈ చిత్రం చారిత్రక అంశాలను మతపరమైన కోణంలో చూపిస్తూ సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందని ఆరోపించింది.రాజ్‌పుత్ చరిత్రను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని హెచ్చరించిన పరిషత్, చౌహాన్ వంశం పేరును వివాదాలకు ఎరగా మార్చడం బాధ్యతారాహిత్యమని పేర్కొంది. భారత మధ్యయుగ చరిత్రను కేవలం హిందూ – ముస్లిం విభజనగా చూపించడం సరైన దృక్పథం కాదని, ఆ కాలంలోని యుద్ధాలు ప్రధానంగా రాజ్య విస్తరణ, వ్యూహాలు, కూటముల ఆధారంగా జరిగాయని వివరించింది. మహారాణా సంగా సైన్యంలో మహమూద్ లోడీ, మహారాణా ప్రతాప్ సైన్యంలో హకీమ్ ఖాన్ సూర్ వంటి ఉదాహరణలను ప్రస్తావిస్తూ చారిత్రక సఖ్యతను గుర్తుచేసింది. రాజకీయ నాయకులు, సినీ నిర్మాతలు చరిత్రను బాధ్యతాయుతంగా చూపించాలని డిమాండ్ చేసింది. కాగా, ఈ వివాదంపై ‘చౌహాన్’ చిత్ర బృందం లేదా అజయ్ దేవ్‌గణ్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

Related Articles