కామెడీ హీరో అల్లరి నరేష్ మరోసారి పూర్తి స్థాయి వినోదంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన 65వ చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’ టైటిల్‌తో తెరకెక్కుతోంది. నరేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది.
చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రానికి ‘కామెడీ గోస్ కాస్మిక్’ అనే ట్యాగ్‌లైన్‌ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్‌లో అల్లరి నరేష్ స్వర్గపు మెట్లపై స్టైలిష్‌గా కూర్చొని, చేతిలో రంభ, ఊర్వశి, మేనక పేర్లు ఉన్న స్క్రోల్ పట్టుకుని కనిపించారు. చుట్టూ అప్సరసలతో కూడిన ఫాంటసీ నేపథ్యం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సీనియర్ నరేష్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్‌ను సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అభిమానులు అల్లరి నరేష్ మార్క్ కామెడీని మరోసారి ఆస్వాదించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

