తెలుగు సినీ పరిశ్రమలో చిన్న చిత్రాల మనుగడపై మరోసారి ఆందోళన వ్యక్తమైంది. థియేటర్లలో సినిమాలను విడుదల చేయాలంటే క్యూబ్, యూఎఫ్వో, పీఎక్స్డీ వంటి డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు వసూలు చేస్తున్న వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీ) ఛార్జీలు చిన్న నిర్మాతలకు భారంగా మారాయని ఆరోపిస్తూ ఆర్కే గౌడ్, ‘దీక్ష’ మూవీ టీమ్ సోమవారం హైదరాబాద్ ఫిలింఛాంబర్ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టింది. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టంగా మారడంతో పాటు, డిజిటల్ ఛార్జీల భారం కారణంగా విడుదల కూడా ప్రశ్నార్థకంగా మారుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై ప్రభుత్వం, సినీ పరిశ్రమ పెద్దలు వెంటనే స్పందించి డిజిటల్ ఛార్జీలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మహాధర్నాలో తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణగౌడ్, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్, నిర్మాతలు గురురాజ్, లయన్ సాయి వెంకట్, హీరో కిరణ్, షెరాజ్ మెహదీతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. చిన్న చిత్రాలను ప్రోత్సహించకపోతే కొత్త దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులకు అవకాశాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. ప్రభుత్వం, పరిశ్రమ పెద్దలు వెంటనే జోక్యం చేసుకుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
- June 30, 2026
0
7
Less than a minute
You can share this post!
editor

