బ్యాంకాక్‌లో పూరీకి వీఐపీ ట్రీట్‌మెంట్

బ్యాంకాక్‌లో పూరీకి వీఐపీ ట్రీట్‌మెంట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ను తెలిపే ఆసక్తికర సంఘటనను దర్శకుడు పూరి జగన్నాథ్ వెల్లడించారు. ఇటీవల విడుదలైన ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ డాక్యుమెంటరీలో ఈ విషయాన్ని ప్రభాస్ అభిమానులతో పంచుకున్నారు.

‘బాహుబలి’ తొలి భాగం విడుదలైన సమయంలో చిన్న ఇన్ఫెక్షన్ చికిత్స కోసం పూరి జగన్నాథ్ బ్యాంకాక్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. వెయిటింగ్ రూమ్‌లో ఉన్న ఆయనను ఓ నర్స్ ఇండియా నుంచి వచ్చారా అని అడిగి, వెంటనే “బాహుబలి?” అని ప్రశ్నించింది. దీంతో పూరి, ప్రభాస్‌తో కలిసి దిగిన ఫొటో చూపిస్తూ తాను ఆయన స్నేహితుడినని చెప్పారు.

అది చూసిన నర్స్ వెంటనే ఆస్పత్రి సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పూరికి ప్రత్యేక గౌరవం లభించింది. వెయిటింగ్ లేకుండానే ప్రత్యేక గదికి తీసుకెళ్లి చికిత్స అందించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని పూరి వాయిస్ మెసేజ్ రూపంలో ప్రభాస్‌కు పంపగా, అప్పట్లో ఆయనతో పాటు ఉన్న దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ కూడా ఆశ్చర్యపోయినట్లు డాక్యుమెంటరీలో వెల్లడైంది.

‘బాహుబలి’ చిత్రానికి విదేశాల్లో ఉన్న ఆదరణకు ఈ సంఘటన మరో ఉదాహరణగా నిలిచింది. ఇదే డాక్యుమెంటరీలో ‘బాహుబలి 3’పై కూడా స్వల్ప సంకేతాలు కనిపించడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

Related Articles