ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొతినేని తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘RAPO23’ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సినిమాతో రామ్ హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగానూ కొత్త ఇన్నింగ్స్ ఆరంభించడం విశేషం. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన కథను కూడా స్వయంగా ఆయనే రూపొందించినట్లు చిత్ర బృందం వెల్లడించింది.
హైదరాబాద్‌లో సోమవారం సంప్రదాయబద్ధంగా జరిగిన పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. నిర్మాత కృష్ణ పొతినేని స్క్రిప్ట్‌ను రామ్‌కు అందజేయగా, సీనియర్ నటుడు మురళీమోహన్ ముహూర్తపు షాట్‌కు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ నిర్మాత పీవీ రవికిషోర్ క్లాప్ కొట్టగా, తొలి షాట్‌కు రామ్ స్వయంగా దర్శకత్వం వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది.
‘RAPO23’ను సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా, నియో నోయర్ శైలిలో రూపొందిస్తున్నారు. ఇందులో రామ్ ఇప్పటివరకు కనిపించని విభిన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాని కృష్ణ పొతినేని స్థాపించిన రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ తిరు ఛాయాగ్రహణం అందిస్తుండగా, పీటర్ హైన్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలను ఏఎస్ ప్రకాష్ నిర్వహిస్తున్నారు. హీరోయిన్‌గా నివేతా పేతురాజ్ నటించే అవకాశాలు ఉన్నప్పటికీ, పూర్తి తారాగణాన్ని చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

