తమిళ నటుడు, నిర్మాత విమల్ చెక్ బౌన్స్ కేసులో న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై చిన్న కేసుల పరిష్కార న్యాయస్థానం ఆయనకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. అయితే ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ శిక్ష అమలుపై తాత్కాలిక స్టే మంజూరు చేసింది. విమల్ నిర్మించిన ‘మన్నర్ వాగైయరా’ సినిమా కోసం ఫైనాన్షియర్ గోపి వద్ద నుంచి సుమారు రూ.4.5 కోట్ల రుణం తీసుకున్నట్లు సమాచారం. రుణం చెల్లింపులో భాగంగా ఇచ్చిన చెక్ బ్యాంకులో తగినంత నిధులు లేకపోవడంతో బౌన్స్ అయింది. అనంతరం బకాయిలు చెల్లించకపోవడంతో గోపి కోర్టును ఆశ్రయించగా కేసు విచారణకు వచ్చింది.
ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఆర్తి విమల్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. వెంటనే విమల్ తరపు న్యాయవాదులు అప్పీల్ చేసుకునేందుకు సమయం ఇవ్వాలని కోరడంతో కోర్టు శిక్ష అమలుపై తాత్కాలిక స్టే విధించింది. దీంతో విమల్‌కు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం లభించింది. ఇప్పుడు ఈ కేసు తదుపరి విచారణపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

