సినిమాలోని ప్రతీ సన్నివేశం రియల్‌గా కనిపిస్తుంది. కథ మొత్తం ఫాదర్ సెంటిమెంట్‌తో నడుస్తుంది. నా కెరీర్‌లో బాగా సంతృప్తినిచ్చిన సినిమా ఇది. ఆయన హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో సునీల్ బలుసు నిర్మించిన ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా ఈ నెల 11న థియేటర్లలోకి రానుంది. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుధీర్‌బాబు మాట్లాడుతూ ‘కన్నతండ్రి, పెంచిన తండ్రి, ఒక కొడుకు చుట్టూ సరదా సంభాషణల మధ్య జరిగే కథ ఇది. యూనివర్సల్ పాయింట్ కాబట్టి అందరి హృదయాలను టచ్ చేస్తుంది. మానవ సంబంధాల్లోని ఐక్యతను చాటిచెబుతుంది. మనందరి జీవితాల్లో సూపర్‌హీరో నాన్నే. ఈ కథలో హీరో తండ్రిని ఎంతగానో ప్రేమిస్తుంటాడు. అతనే సర్వస్వం అనుకుంటూ బతుకుతుంటాడు.
ఈ క్రమంలో అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది కథలో ఆసక్తిని రేపుతుంది. ఈ సినిమాలోని ఎమోషన్స్ ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయి అన్నారు. మహేష్‌బాబు ఈ సినిమా టీజర్ చూసి ఎంతగానో ప్రశంసించారని, హార్ట్‌టచింగ్‌గా ఉందన్నారని సుధీర్‌బాబు తెలిపారు. మనసుకు నచ్చిన కథలతో సినిమాలు చేస్తున్నానని, ప్రస్తుతం ‘జటాధరా’ షూటింగ్ జరుగుతోందని, రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో ఓ సినిమా కూడా ఉంటుందని సుధీర్‌బాబు పేర్కొన్నారు.